ఇప్పటికాలంలో ప్రతివాడూ గురువే అవుతున్నాడు. శిష్యులు తక్కువైపోతున్నారు. గురువులు జాస్తి అయిపోతున్నారు. వాస్తవంగా గురువు అని మనం ఎవరిని అనవచ్చు? అనే ప్రశ్నకు ఆదిశంకరభగవత్పాదులవారు సెలవిచ్చారు. “కో గురుః? అధిగత తత్త్వః శిష్య హితాయోగ్యతస్సతతం” – కోగురుః – గురువు ఎవరు అని ప్రశ్న వేసి దానికి ఆయన జవాబు చెప్పారు అధిగత తత్త్వః శిష్యహితాయోగ్యతస్సతతం – ఎవరైతే శాస్త్రోక్తమైనటువంటి తత్త్వాన్ని గ్రహించి ఉన్నారో, ఎవరైతే శిష్యుని యొక్క సంశయాలు తీర్చగలిగి ఉంటారో ఎవరైతే శిష్యులయొక్క హితమునే సదా కోరుతూ ఉంటారో ఆ వ్యక్తియే గురువు అనే పదానికి యోగ్యుడు అవుతాడు. కాబట్టి గురువుకి ముఖ్యంగా ఉండవలసిన యోగ్యతలు రెండు: ౧. శిష్యుని యొక్క సంశయములను తీర్చగలిగే శక్తి ఉండాలి. ౨. శిష్యునియొక్క హితమునే సదా కోరేటటువంటి వాడై ఉండాలి. ఈ రెండు లక్షణములున్నప్పుడే ఆ వ్యక్తిని గురువు అని భావించి పూజించడానికి అవకాశం ఉన్నది. భగవత్పాద శంకరులు ఈ లక్షణములు పరిపూర్ణంగా కలిగినటువంటి మహానుభావులు. ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం, కరుణలకు అవధులే లేవు. ఆయన వ్రాసినటువంటి భాష్య గ్రంథాలను ఇవ్వాల్టి రోజున మనం ఎంత చదివినా ఇంకా తెలుసుకోవలసినటువంటి అనేకమైన అపూర్వ విషయాలున్నాయి. వాటిని ఒక జీవనకాలంలో పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాం అని చెప్పడానికి వీలులేదు.
అటువంటి గంభీరమైన భాష్య గ్రంథాలను కేవలం తమ పదహారో సం!! వచ్చేలోపల వ్రాశారు. ఇవాల్టి రోజున పదహారో యేట రఘువంశం సరిగ్గా అర్థం చేసుకోవడం కుదరడం లేదు. ఆయన పదహారో సం!! వచ్చేలోపల ఈ భాష్యగ్రంథాలన్నింటినీ వ్రాసి ముద్రించేశారు. సాక్షాత్తూ బ్రహ్మసూత్రములను వ్రాసినటువంటి వేదవ్యాసుల వారితో ఆయన గోష్ఠి జరిపారు. వేదవ్యాసులవారు అడిగినటువంటి అన్నిప్రశ్నలకూ సమంజసమైన జవాబులు ఇచ్చారు. శంకరులవారు కాశీలో తమ శిష్యులకు భాష్య పాఠములు చెప్తూంటే వేదవ్యాసులవారు నిజరూపంలో వస్తే ఆయన తెలుసుకుంటారు అని చెప్పి ఆయనకు తెలియకూడదనే దృష్టితో ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చారు. ఇప్పటి కాలంలో Surprise visit అంటారు. నాయనా! ఏం చెప్తున్నావు నువ్వు? అని అడిగారు. శంకరుల శిష్యులు సమాధానం చెప్పారు. వీరు మా గురువుగారు శంకర భగవత్పాదులు. వేదవ్యాసులవారి సూత్రాలకు భాష్యాలు వ్రాసి వాటిని మాకు పాఠాలు చెప్తున్నారు అని. అప్పుడా వృద్ధ బ్రాహ్మణుడు శంకరులను పిలిచి “నాయనా! నువ్వు వేదవ్యాసుల వారి సూత్రాలకు భాష్యం వ్రాశావుట. చాలా సంతోషం. ఎక్కడన్నా ఒక సూత్రం అడగనా? దానికి సరిగా అర్థం చెప్పగలవా అని. దానికి శంకరులు “కుత్రజ్ఞతాహం కృతిరస్తినూనే సూత్రార్థ విద్భ్యోస్తు నమో గురుభ్యః తథాపి యత్…తద్బ్రవీమ్!” అయ్యా! వేదవ్యాసుల వారి సూత్రములకు అర్థం నాకే తెలుసు అనే అహంకారం నాకు లేదు. సూత్రార్థం తెలిసిన వాడిని నేనే అన్న అహంకారం నాకు లేదు. సూత్రార్థం తెలిసిన అందరికీ నా నమస్కారం. కానీ మీరు సూత్రం ఎక్కడైనా అడుగుతాను అంటున్నారు. అడగండి. నాకు తెలిసిన నాలుగు ముక్కలు చెప్తాను. అన్నారు. అటువంటి వినయం మన పూర్వులలో ఇంత విస్తృతంగా ఉంది. యాజ్ఞవల్యుడిని జనకమహారాజు సభలో అందరూ ప్రశ్నలు వేస్తే ఆయన ఇంకా ప్రశ్నలు వేయండి నాకు తెలిస్తే చెప్తాను అన్నారు. జ్ఞానంయొక్క సముద్రం ఆయన. అటువంటి వినయం వారిలో ఉండేది. అలాగే శంకరులు కూడా నాకే తెలుసు అనే భావన నాకు లేదు కానీ నాకు తెలిసింది చెప్తాను అన్నారు. వేదవ్యాసుల వారు మూడో అధ్యాయంలో చాలా గడ్డైన విషయం అడిగారు. దీనికి సమాధానం చెప్పు అన్నారు.
సమాధానం చెప్పారు. శంకరులు. అబ్బే అదేం బాగోలేదు అని ఖండించేశారు ఆయన. అబ్బెబ్బే నేను చెప్పింది మీకు అర్థం కాలేదు అని ఈయన ఖండించారు. ఈవిధంగా వాదన ఏడురోజులు సాగింది. దీనిని చూసిన పద్మపాదులు వచ్చిన ఆయన సామాన్యుడు కాదు. స్వయం సూత్రకారుడే అయుండాలి. లేకపోతే ఇటువంటి వాదన మరెవ్వరూ చేయడానికి వీలులేదు మన గురువుగారితో.
అని
శంకరశంకరస్సాక్షాత్ వ్యాసో నారాయణో హరిః! తయోర్వివాదే సంప్రాప్తే కింకరః ”
శంకరులు సాక్షాత్తు పరమేశ్వరులు. వ్యాసులు సాక్షాత్ శ్రీమన్నారాయణులు. వాళ్ళిద్దరూ వివాదం మొదలుపెడితే మాబోటిగాళ్ళం ఎక్కడికి పోవాలి? అని అన్నారట. వ్యాసులవారు పరమసంతోషించి నిజరూపంలో శంకరులవారికి దర్శనం ఇచ్చారు. ఎందుకు చెప్తున్నాను అంటే శంకరుల వారు తన పదహారో సంవత్సరం వచ్చే లోపల భాష్యాలను వ్రాయడం మాత్రమే కాకుండా స్వయం సూత్రకారుడైన వేదవ్యాసులతో వివాదం చేసి వారిని సంతోషపరచి వేదవ్యాసులతో శభాష్ అనిపించుకున్నారు. తమరు వ్రాసిన సూత్రాలకు భాష్యం వ్రాయడం అనే సాహసం చేశాను. దీనిని మీరు తిలకించి యేమి తప్పులున్నాయో నాకు తెలియజెప్పాలి అన్నారు శంకరులవారు. వ్యాసులవారు భాష్యం అంతా చూసి నా సూత్రాలకు భాష్యం చేయడం అనేది సాహసం కాదు కానీ దీనిలో తప్పులు చెప్పమన్నావు అది మాత్రం సాహసం మాట అన్నారు. నీ భాష్యంలో ఎక్కడా యేవిధమైనటువంటి ఆక్షేపణకూ అవకాశం లేదు. “గోవింద శిష్యస్య రసం ద్విరుక్తం” – గోవిందపాదుల శిష్యుడివి. నీ భాష్యంలో ద్విరుక్తం ఎక్కడ వస్తుందయ్యా? నీభాష్యం ఆచంద్రతారార్కం ఉంటుంది. అని వ్యాసులవారు ఆశీర్వదించారు. అందువల్లనే ఇవాల్టి రోజున వ్యాసుల వారి బ్రహ్మసూత్రములకు అనేకమంది భాష్యములు వ్రాసినప్పటికీ శంకరుల వారి భాష్యానికి యే స్థానం ఉన్నదో ఆస్థానం మిగతా వేటికీ లేదు. కాబట్టి గురువు అనే పదానికి సరియైనటువంటి లక్ష్యభూతి లేనటువంటి వారు ఆదిశంకరభగవత్పాదుల వారు.
శిష్య హితాయ…… సతతమ్ – శిష్యులయొక్క హితాన్నే సర్వదా కోరేటటువంటి వారు అని చెప్పడానికి వారు చేసినటువంటి ధర్మ ప్రచారం, వారు రచించినటువంటి గ్రంథములు, వారు చేసిన చతురామ్నాయ పీఠ స్థాపన, ఇవన్నీ వారియొక్క కరుణ, దయకు ప్రత్యక్ష నిదర్శనాలు. ఆ కరుణ, దయ, శిష్య హితేచ్ఛ ఆయనకు లేకపోయినట్లైతే ఇంత సంచారం ఎందుకు చేయవలసి వచ్చింది? గ్రంథరచన ఎందుకు చేయవలసి వచ్చింది? చతురామ్నాయ పీఠస్థాపన ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇదంతా కేవలం శిష్యహితం కోసమే కదా! కాబట్టి ఆ శిష్య హితేచ్ఛ, తత్త్వజ్ఞానం, శంకరులలో పరాకాష్ఠతో ఉన్నవి కాబట్టి ఆయన మనందరికీ పూజనీయతములైన గురువులు. వారిని మనం అత్యంత శ్రద్ధాభక్తులతో సేవించి వారియొక్క కృపను పొందాలి. అందుకే మా పరమేష్ఠి గురువుల వారు శృంగేరి జగద్గురువులు సచ్చిదానంద నృసింహ భారతీ స్వామివారు శంకరుల విషయంలో మనమందరం కూడా అత్యంత కృతజ్ఞతతో ఉండాలి అనే దృష్టితో వారియొక్క జన్మభూమిని అన్వేషించి అక్కడ శంకరుల వారికి దేవాలయం నిర్మించారు. వారు జన్మించిన వైశాఖ శుక్ల పంచమిని శంకరజయంతిగా ప్రతిఒక్కడూ ఆచరించాలి అని కట్టడి చేశారు. నాటినుండి కాలడి క్షేత్రం మనకు పరమ పవిత్ర క్షేత్రమైంది. శంకరజయంతి పరమ పవిత్రంగా ఆచరింపబడుతూ వచ్చింది. అందుకే ఈ గురువు అనేటటువంటి వాడికి అటువంటి స్థానం శాస్త్రంలో ఇవ్వబడ్డది. ఆచార్య దేవో భవ అని శృతి యేదైతే చెప్పిందో దానినే ఆపస్తంభమహర్షుల వారు “దేవమివ ఆచార్యముపాసీత”- ఆచార్యమ్ దేవమివ ఉపాసీత – గురువు అనేటటువంటి వారిని దేవమివ ఉపాసీత. ఆచార్య శబ్దానికి అర్థం చెప్పారు శాస్త్రంలో. “ఆచరోదిద శాస్త్రార్థం ఆచార స్థాపయత్యపి స్వయమ్ ఆచరతేయస్మాత్ తస్మాదాచార్య ఉచ్ఛతే.” – శాస్త్రార్థాన్ని చక్కగా తెలుసుకొని దానిని స్వయం ఆచరిస్తూ అన్యులతో ఆచరింపజేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడే ఆచార్య శబ్దానికి అర్హుడు.
అటువంటి ఆచార్యుడు భగవత్పాద శంకరులు. వారియొక్క పరంపరలో మనమందరం కూడా ఈ సనాతన ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉపనిషత్ప్రతిపాద్యమైన అద్వైత సిద్ధాంతాన్ని తెలుసుకుంటూ మనయొక్క జన్మని ధన్యం చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా మనకున్నది. ఈ ధర్మం, ఈ అద్వైత తత్త్వం సర్వత్రా, సర్వదా ప్రచారం కావాలనే దృష్టితో శంకరులు ఈ చతురామ్నాయ పీఠస్థాపన చేశారు. అందులో తమ దక్షిణామ్నాయ పీఠాన్ని శృంగేరీ క్షేత్రంలో స్థాపించారు. నాటినుంచి శృంగేరీ క్షేత్రంలో గురుపరంపర అనేది అవిచ్ఛిన్నంగా వస్తూ ఉన్నది. ఆ పరంపరలో మా గురువుగారు జగద్గురు అభినవ తీర్థ మహాస్వామి వారు ఆసేతు సీతాకరం రెండు మూడు పర్యాయములు సంచారం చేశారు. వారు తమ సంచారంలో ఒంగోలు నగరానికి విజయం చేశారు. ఇక్కడి మహాజనులను విశేషంగా అనుగ్రహించారు. వారి అనుగ్రహంతో ఈయాత్ర మేము చేయడం జరుగుతున్నది.